కరోనా వ్యాక్సిన్‌ను తమ దేశంలో ఆగస్టు 10 నుంచి పంపిణీ చేసేందుకు రష్యా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్ అక్కడ చివరి దశకు చేరుకున్నాయి. రష్యా సైంటిస్టులు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు గాను అక్కడి సైనికులపై ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 2వ వారం నుంచి వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు రష్యా ప్రణాళికలు రచిస్తోంది.
రష్యాలోని మాస్కోకు చెందిన గమాలెయా ఇనిస్టిట్యూట్ సదరు వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు వ్యాక్సిన్లను మోడిఫై చేసి సదరు వ్యాక్సిన్‌ను తయారు చేశామని సైంటిస్టులు తెలిపారు. ఈ క్రమంలో ఆ వ్యాక్సిన్‌ను ఆగస్టు 10 నుంచి ప్రజా పంపిణీకి సిద్ధం చేయాలని రష్యా భావిస్తోంది. అయితే ముందుగా అక్కడి అత్యవసర సర్వీసుల సిబ్బందికి ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు.
రష్యాలో కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తే ముందుగా దాన్ని అత్యవసర సేవల సిబ్బందికి ఇస్తారు. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, పోలీసులు తదితర సేవలను అందించే వారికి వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు రష్యా తెలిపింది. అయితే రష్యా అనుకున్న సమయం వరకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తే ప్రపంచంలోనే ముందుగా కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిన దేశంగా అవతరిస్తుంది. మరి అది జరుగుతుందో, లేదో చూడాలి.