రష్యాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ సేనల ప్రతిఘటనతో చాలా ఆయుధ సంపత్తిని కోల్పోతోంది. యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను ఉక్రెయిన్ దళాలు స్ట్రింగర్ మిస్సైళ్లతో పిట్టల్లా నేలపైకి రాలుస్తున్నారు. ఇదిలా ఉంటే మేజర్ జనరళ్లను రష్యా కోల్పోతోంది. తాజాగా మరో రష్యన్ ఆర్మీ మేజర్ జనరల్ ని హతమార్చినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 21 రోజుల్లో నలుగురు మేజర్ జనరల్ లను రష్యా కోల్పోయింది. తాజాగా ఆగ్నేయ నగరం మారియుపోల్ చుట్టూ జరిగిన పోరాటంలో రష్యా మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్ మంగళవారం మరణించినట్లు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు అంటోన్ గెరాష్చెంకో తెలిపారు. మిత్యేవ్, 46, 150వ మోటరైజ్డ్ రైఫిల్ విభాగానికి కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు గతంలో సిరియాలో కూడా పని చేసశారని గెరాష్చెంకో చెప్పారు.
ఇలా వరసగా మేజర్ జనరల్ లను కోల్పోవడం రష్యాకు తీవ్ర ఎదురుదెబ్బే. ఇప్పటికే మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్, మేజర్ జనరల్ సుఖోవెట్స్కీ, రష్యా దళాల ప్రధాన కార్యాయలం డిప్యూటి ఛీప్ మేజర్ ఆండ్రీ బుర్లకోవ్ ఉక్రెయిన్ దాడుల్లో మరణించారు. మరోవైపు యుద్ధంలో ఇప్పటి వరకు రష్యా 13500 మంది సైనికులను హతమార్చడంతో పాటు 81 యుద్ధ విమానాలను, 95 హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.