నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఒక్కొక్కటిగా తన ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నారు. తాజాగా మంగళవారం ఆయన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఇది తాను ఇచ్చిన తొలి వాగ్దానంగా జగన్ చెప్పుకున్నారు. అంతే కాదు.. చెప్పిన దాని కంటే ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తున్నానని.. చెప్పిన సమయం కంటే ముందే ఇస్తున్నానని జగన్ ప్రకటించుకున్నారు.
వాస్తవానికి జగన్ చెప్పింది అక్షరాలా నిజమే. కాకాపోతే విడతల వారీగా ఇవ్వడమే కాస్త రైతుల్లో అసంతృప్తిగా ఉంది. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. జగన్ కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింప జేశారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ కౌలు రైతుల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీలకు మాత్రమే ఈ రైతు భరోసా అందుతుంది.
ఈ పథకం నియమాలు అలా రూపొందించారు. ఇప్పుడు ఇది వివాదాస్పదం అవుతోంది. రైతుల్లో .. అందులోనూ కౌలు రైతుల విషయంలో కుల వివక్ష చూపడం ఏంటన్న విమర్శలు అప్పుడే టీడీపీ నుంచి మొదలయ్యాయి. రైతులను కూడా కులాల ప్రకారం విడదీసిన మొదటి సీఎం జగనే అంటూ టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. టీడీపీ నాయకులు విమర్శించారని కాకపోయినా ఈ నిబంధన ఓసీ కౌలు రైతులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది.
కౌలు రైతులు అంటేనే సొంత భూమిలేని వారు.. వ్యవసాయం దండుగగా మారుతున్న ఈ రోజుల్లో ఈ కౌలు రైతుల బాధలు మరీ దారుణం. అలాంటి రైతులకు రైతు భరోసా కొండంత అండగా ఉంటుందనడం లో సందేహం లేదు. కానీ ఈ కుల నిబంధన కారణంగా ఓసీ రైతుల్లో తీవ్ర అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది. అది జనంలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తే వైఎస్ జగన్ కు రాజకీయంగానూ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది.