కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంకి భక్తుల తాకిడి పెరుగుతుంది. ఆదివారం ఒక్కరోజే సుమారు లక్ష ఇరవై వేల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారని ట్రావెన్కోర్ దేవస్థాన మండలి వెల్లడించింది. గత ఐదు వారాల్లో ఆలయానికి 200 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని తెలిపారు. గత నెల నవంబర్ 17 నుంచి డిసెంబర్ 25 మధ్య సుమారు 31 లక్షల మంది ఆలయాన్ని సందర్శించి ఉంటారని టిడిబి అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు.39 రోజులలో భక్తుల విరాళం, ప్రసాదాల అమ్మకాల ద్వారా స్వామివారి క్షేత్రానికి 204.30 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.
డిసెంబర్ 25 వరకు ఆలయంలో ఏడు లక్షల మందికి పైగా భక్తులకు అన్నదాన సత్రంలో ఉచిత ఆహారం అందజేశామని తెలిపారు. ఈ ఏడాది శబరిమల మండల దర్శనం వేడుకలు నవంబర్ 17న ప్రారంభం అయి డిసెంబర్ 27 మండల పూజతో ముగుస్తుంది. అనంతరం గుడిని రెండు రోజులపాటు మూసి ఉంచి మరల డిసెంబర్ 30న తెరుస్తారు. ఈ సంవత్సరం దర్శనానికి భక్తుల తాకిడి ఎక్కువ అవడం వల్ల గంటల కొద్ది క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది.