గుడ్ న్యూస్.. జూన్ 14న తెరుచుకోనున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం..

-

క‌రోనా లాక్‌డౌన్ 5.0లో భాగంగా ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తుండ‌డంతో జూన్ 8వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక ప్ర‌దేశాలు మ‌ళ్లీ తెరుచుకోనున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఏపీలో జూన్ 11 నుంచి తిరుమ‌ల ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. ఇక తెలంగాణ‌లో జూన్ 8 నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా ఆల‌యాలు తెరుచుకోనున్నాయి. ఈ క్ర‌మంలోనే అటు కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల ఆలయాన్ని కూడా జూన్ 14 నుంచి తెర‌వ‌నున్నారు.

జూన్ 14 నుంచి జూన్ 28వ తేదీ వ‌ర‌కు శ‌బరిమ‌ల ఆల‌యం తెరిచి ఉంటుంద‌ని దేవ‌స్థానం మంత్రి క‌డకంప‌ల్లి సురేంద్ర‌న్ తెలిపారు. మ‌ళ‌యాళీల మాస‌మైన మిథునం జూన్ 15 నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని, దీంతో ఆచారం ప్ర‌కారం భ‌క్తులు మాస‌పూజ‌, ఉత్స‌వాల్లో పాల్గొంటార‌ని తెలిపారు. అందుకుగాను ఆల‌యాన్ని తెరుస్తామ‌ని వివ‌రించారు.

ఉద‌యం 4 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇస్తామ‌ని తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే భ‌క్తులు రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన కోవిడ్ జాగ్ర‌త్త రిజిస్ట్రేష‌న్ వెబ్‌సైట్‌లో త‌మ వివ‌రాల‌ను ముందుగా న‌మోదు చేసుకోవాల‌ని, వారికే ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. ఇక భ‌క్తులు త‌మ‌కు ఎలాంటి వ్యాధులు లేవ‌ని నిర్దారిస్తూ ల్యాబ్‌ల నుంచి తెచ్చుకున్న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను అంద‌జేయాల‌ని, ఆ ల్యాబ్‌లు ఐసీఎంఆర్ గుర్తింపు క‌లిగి ఉండాల‌ని అన్నారు. అన్ని వివ‌రాల‌ను ప‌రిశీలించాకే భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తామ‌ని, క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని అన్నారు. భౌతిక దూరం పాటించ‌డం, మాస్కులు ధ‌రించ‌డంతోపాటు శానిటైజర్ల‌ను వాడాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version