బొత్స చేసిన వ్యాఖ్యలు తెలంగాణను కించపర్చేలా ఉన్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆయన వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యా వ్యవస్థను వేలెత్తి చూపేంతస్థాయి ఏపీ మంత్రికి లేదని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలపై చర్చించేందుకు సిద్ధమా అని సవాలు విసిరారు. తాము చేసింది ఏంటో, ఏపీలో ఉద్ధరించింది ఏంటో చర్చించాలని అన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థ, పరీక్షల నిర్వహణలో లోపాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏపీ మాత్రం విరుద్ధంగా మాట్లాడడం శోచనీయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగు పరుస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పడిన తరువాత 1050 గురుకులాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణలో ఒక్కో విద్యార్ధి పైన రూ.లక్ష 50వేలను ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఓఆర్‌సీసీ కింద ప్రతి విద్యార్థికి రూ. 2 .50 లక్షలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో రెండు సార్లు ఉపాధ్యాయులను బదిలీలు చేశామని గుర్తు చేశారు. కొంత మంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లడం వల్ల బదిలీలు ఆగాయని తెలిపారు.