తెలంగాణ సీఎం కేసీఆర్‌కు యజ్ఞ యాగాలు చేయడం కొత్తేమీ కాదు..అందులోనూ రాజశ్యామల యాగం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ ఆవిర్భవించడం..దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి కేసీఆర్ రెడీ అయిన నేపథ్యంలో యాగం చేయించడానికి సిద్ధమయ్యారు. అది ఢిల్లీలో కొత్తగా బీఆర్ఎస్ ఆఫీసు వద్ద ఈ యాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే సతీసమేతంగా కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. రెండురోజుల పాటు ఈ యాగం నిర్వహించనున్నారు.
అలాగే ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని కేసీఆర్ ఈ నెల 14న ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ప్రారంభిస్తున్నది తాత్కాలిక కార్యాలయమే కాబట్టి, కొద్ది మంది జాతీయ నేతలను మాత్రమే ఆహ్వానించినట్లు తెలిసింది. శాశ్వత కార్యాలయం వసంత విహార్‌లోఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అయితే బీఆర్ఎస్ నేతలు సైతం కొంతవరకే వెళ్లనున్నారని తెలుస్తోంది. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లాల వారీగా కొందరు నేతలు ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ వెంటే ఆయన కుమార్తె కవిత కూడా వస్తుందని అందరూ భావించగా.. హైదరాబాద్‌లో జాగృతి కార్యక్రమం వల్ల ఆమె రాలేదు.
ఇక ఈ యాగంతో దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ దశ మారుతుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే యాగం జరిపించిన ప్రతిసారి కేసీఆర్‌కు విజయాలే వచ్చాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పాడ్డాక యాగం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కూడా సక్సెస్ అవుతుందని నేతలు భావిస్తున్నారు.
అయితే మొదట బీఆర్ఎస్ పార్టీని కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో విస్తరించడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు..ఆ తర్వాత నిదానంగా దేశ రాజకీయాలపై ఫోకస్ చేసి..విపక్ష పార్టీలని ఏకం చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు విపక్ష నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక కామెంట్లు చేశారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు జరుగుతుందని చెప్పుకొచ్చారు. మరి చూడాలి బీఆర్ఎస్ ఏ మేర సత్తా చాటుతుందో.