ఏపీలో రెండు కీలక పార్టీలు.. వైసీపీ-టీడీపీల్లో ఒకే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అవ్వడానికి డిఫ రెంట్ పార్టీలే అయినా.. ఒకటి అధికారంలో ఉన్నా.. మరొకటి ప్రతిపక్షంలో ఉన్నా.. నేతల మధ్య మాత్రం ఒకే విషయంపై చర్చ సాగుతుండడం ఆసక్తిగా మారింది. అదే.. తమ మనసును తెలుసుకోవడంలో పార్టీ ల అధినేతలు ఫెయిలవుతున్నారనే! గతంలో తాము వద్దన్నా.. వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకున్నారని టీడీపీ నేతలు చెప్పేవారు. ఇక, ఇటీవల పార్టీ పదవుల విషయంలోనూ తమతో మాట మాత్రంగా అయినా.. చంద్రబాబు సంప్రదించలేదని అంటున్నారు.
పార్టీలో సీనియర్లు ఎంతో మందిని పక్కన పెట్టి.. ఎప్పుడూ పదవులు పొందుతున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని వారు అంటున్నారు. అదేసమయంలో వారసుల విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం పైనా చంద్రబాబు వైఖరిని తప్పుపడుతున్నారు. పార్టీ డెవలప్‌మెంట్ కోసమే తాము కూడా ఉన్నామని.. కానీ, పార్టీ విధాన నిర్ణయాలు.. లేదా.. ముఖ్యమైన విషయాల్లో తమకు పార్టిసిపేషన్ దక్కడం లేదని అంటున్నా రు. ఇదే విషయంపై కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ బయట పడిపోయారు. “మేం ఉన్నాం.. ఎందుకు ఉన్నామో.. తెలియడం లేదు.
కనీసం ఇది చేస్తున్నాం.. అది చేస్తున్నాం.. మీ అభిప్రాయం ఏంటి? అని కూడా అడగరు“ అని ఆయన ఆఫ్ దిరికార్డుగా అధినేతపై విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఈ పరిస్థితి ఒక్క జిల్లాలోనే కాదు.. ప్రతి జిల్లాలోనూ కనిపిస్తోంది. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. “పార్టీ అధికారంలో ఉంది. అధినేత ఏం చేస్తారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. కనీసం మాకు సమాచారం ఉండదు. మమ్మల్ని, మా అభిప్రాయాల్ని కూడా పట్టించుకోరు. ఏదో పేరుకే మేం ఉన్నాం“ అని చాలా మంది నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
కొందరు ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని బయటకు నేరుగా చెప్పేస్తున్నారు. “మాకు కూడా అభి ప్రాయాలు ఉంటాయి. కానీ. ఏ ఒక్కసారి కూడా మమ్మల్ని అడగరు. ఏదైనా తేడా కొట్టాక.. మాత్రం ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటారు. కనీసం మా అభిప్రాయాలు అడిగితే.. మేం ఏదైనా చెబుతాం కదా! “ అంటున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రెండు పార్టీల్లోనూ నేతలు ఒకే విషయంపై ఒకే విధంగా అభిప్రాయాలు వెల్లడిస్తుండడం ఆసక్తిగా మారింది. మరి అధినేతలు ఇప్పటికైనా వీరి మాట వింటారా? అనేది చూడాలి.