సెల్ఫీ,. ఇప్పుడు దీని క్రేజ్ అంతా ఇంతా కాదు.. నలుగురు కలిస్తే చాలు గుర్తుగా ఓ సెల్ఫీ.. విందైనా, వేడుక అయినా సెల్ఫీ తప్పనిసరి అయ్యింది. ఇక ప్రముఖులతో సెల్ఫీ దిగితే వెంటనే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిందే. ఎంత పెద్ద సెలబ్రెటీతో సెల్ఫీ దిగితే అంత గ్రేట్..
మరి అలాంటిది ఏకంగా ప్రధాని మోడీతోనే సెల్ఫీ దిగితే.. ఆ సెల్ఫీలో ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఉంటే.. వావ్.. ఎంత లక్కీయో కదా.. తాజాగా అమెరికాలోనిహూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో ప్రధాని మోడీ , డొనాల్డ్ ట్రంప్ తో ఓ లక్కీ బోయ్ సెల్ఫీ తీసుకున్న సంగతి బాగా వైరల్ గా మారింది.
అప్పటి నుంచి ఆ బాలుడు ఎవరా అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో మొదలైంది. ఎవరా కుర్రాడు.. అక్కడ ఎందుకు ఉన్నాడు.. అనేది ఆరా తీయడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఆ అన్వేషణ ఫలించింది. ఆ కుర్రాడి వివరాలు తెలిశాయి. ఈ కుర్రాడు మన పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చెందిన 13 ఏళ్ల సాత్విక్ హెగ్డేగా గుర్తించారు.
మరి ఈ కుర్రాడు అక్కడ ఎందుకు ఉన్నాడంటారా.. మనోడు యోగా స్పెషలిస్టు అట. ఆ హౌడీ మోడీ కార్యక్రమంలో సూర్యనమస్కారాలు ప్రదర్శించేందుకు వచ్చాడట. ప్రసంగాలకు ముందు అగ్రనేతలిద్దరూ నడుచుకుంటూ వస్తున్న సమయంలో అక్కడే ఉన్న సాత్విక్ ఇరు దేశాధినేతలతో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు.. ఒక్క పూటలోనే సెలబ్రెటీ అయిపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.