ఆయనో నిత్యవిద్యార్థి.. వైద్యవృత్తి చేస్తున్నా అధ్యయనం ఆపలేదు.. డాక్టరేట్ చాలామంది విద్యార్థుల కల.. పీహెచ్ డీ చేసి పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవాలని కలకంటుంటారు. కానీ ఆయన ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 33 డాక్టరేట్లు సాధించారు. అది కూడా కేవలం 11 సంవత్సరాల వ్యవధిలోనే..
వైద్య వృత్తిలో ఉంటూ 11 ఏళ్లలో 33 డాక్టరేట్లను సంపాదించిన మల్కాజిగిరికి చెందిన వైద్యుడు డా. సాగి సత్యనారాయణ గిన్నీస్ వరల్డ్ రికార్డ్సులో స్థానం సంపాదించుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాగి సత్యనారాయణ గుంటూరులో ఎంబీబీఎస్ విద్య పూర్తి చేశారు. హైదరాబాద్ లోని మాల్కాజిగిరిలో వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన పలు ప్రముఖ కంపెనీల ఉద్యోగులకు వైద్యసేవలను అందిస్తున్నారు.
సాగి సత్యనారాయణకు తెలుగు, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉంది. వైద్య, ఆరోగ్య, జనరల్, ఆధ్యాత్మిక, సోషల్ సైన్స్, యోగా, వేదాలు, సైకాలజీలపై అనేక వ్యాసాలు రాశారు. అంతటితో ఆయన జ్ఞాన తృష్ణ తీరలేదు. ఆయా అంశాలపై ఆయన పరిశోధనలు సాగించారు. 2008 నుంచి 2019 వరకూ ఆయన అనేక అంశాలపై పరిశోధనలు చేశారు.
మన దేశంలోని ఐదు విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ సాయిలో వివిధ దేశాలకు చెందిన తన పరిశోధనల సారాంశం పంపి.. 25 వర్సిటీల నుంచి డాక్టరేట్లను సాధించారు. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు. సత్యనారాయణ ఇప్పటికీ మల్కాజిగిరిలో సాయంత్రం పూట ఉచితంగా పేదలకు సేవలను అందిస్తుంటారు.