దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా జియోకు షాకిచ్చింది. తమ నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో, ఆ సంస్థకు షాకిస్తూ, తాము మాత్రం ఎటువంటి ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)లను వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ చేసే కాల్స్ ఏ నెట్ వర్క్‌కు అయినా ఉచితమేనని తెలిపింది. వినియోగదారులపై భారం పడకూడదనేది తమ లక్ష్యమని వెల్లడించింది.
తమ వినియోగదారులు ఇతర నెట్ వర్క్ కాల్స్ కోసం ఎప్పటిలానే కాల్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పడం తొందరపాటు చర్యని, ఇంటర్ కనెక్ట్ మధ్య నలుగుతున్న సమస్యకు ఇది పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. ఇదిలావుండగా, ఐయూసీ చార్జీల వ్యవహారం మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాలే తప్ప వినియోగదారులకు సంబంధించిన విషయం కాదని గతంలోనే ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించిన సంగతి తెలిసిందే.