సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు రూపొందించినా, కఠిన శిక్షలు ఎన్ని అమలు చేసినా సమాజంలో మార్పు మాత్రం రావడం లేదు. ఇక తాజాగా మూడో తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలికపై సాక్షాత్తు పాఠశాల ప్రిన్సిపాల్ లైంగికదాడికి యత్నించిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇంతిజార్ అలీ అనే వ్యక్తి మోషియన్ పేరుతో కిషన్‌బాగ్ అసద్‌బాబానగర్‌లో ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్వహిస్తున్నాడు.
ఆర్థిక సమస్యల నేపథ్యంలో సదరు బాలిక తల్లిదండ్రులు స్కూల్ ఫీజు చెల్లించలేకపోయారు. బాలికను పరీక్షకు అనుమతించాలని తల్లిదండ్రులు కోరడంతో ఆధార్ కార్డు, ఇతర పత్రాలు తీసుకొస్తే పరీక్ష రాయిస్తానంటూ ప్రిన్సిపాల్ ఇంతిజార్ అలీ చెప్పాడు. ధవారం తల్లిదండ్రులు బాలికను తీసుకొని పాఠశాలకు వచ్చారు. స్కూల్‌లో కంప్యూటర్ పని చేయడం లేదని బాలిక తల్లిదండ్రులను ఇంటికి పంపిన ప్రిన్సిపాల్ బాలికను స్కూల్‌లోనే ఉంచుకున్నాడు.
సాయంత్రం ఆధార్‌కార్డును పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. ఇంటికెళ్లిన బాలిక విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఇంతిజార్ అలీని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని బహదూర్‌పురా మండల డిప్యూటీ ఈవో వేణుగోపాలాచారి తెలిపారు.