ఆ రోజు జగన్ ను మాట్లాడనివ్వలేదు..అవమానించారు. ఇప్పుడు జగన్ కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు.అంటే ఎవరికి వారు తమ పంతాలను నెగ్గించుకునే స్థితిలో ఉంటూ అసెంబ్లీ లో గెలుపు కోసం జుట్టూ జుట్టూ పట్టుకునే స్థితిలో ఉంటే ప్రజా సమస్యలన్నవి ఏ విధంగా పరిష్కారం అవుతాయో అన్నది ఆ దేవుడికే ఎరుక.ఇప్పటిదాకా అటు పార్లమెంట్ అయినా ఇటు అసెంబ్లీ అయినా విపక్షం లేకుండానే,కీలక బిల్లులపై సుదీర్ఘ చర్చ జరగకుండానే చట్ట సభ ఆమోదానికి నోచుకోవడం విచారకరం.
అంటే ఆ రోజు చంద్రబాబు తప్పు చేశారు కదా అని ! ఇప్పుడు జగన్ ఆ తప్పును మరో విధంగా కొనసాగిస్తూ సంతృప్తి చెందుతున్నారా?
మాట్లాడాల్సినంత మాట్లాడితేనే ఎవ్వరైనా పేరు తెచ్చుకోగలరు.మంచికి మారు మారు పేరు అని అనిపించుకోనూగలరు. కానీ ఇక్కడ మాట్లాడాల్సినంత మాట్లాడనివ్వడం లేదు జగన్.ఆ విధంగా ఆయన టీడీపీ నుంచి విమర్శలు అందుకుంటున్నారు. దీంతో గతంలో అధికార పక్షం చేసిన తప్పిదాలనే పునరావృతం చేస్తూ జగన్ అనవసరంగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.ఫలితంగా ఆయనకు కొత్త శత్రువులు ఏర్పడుతున్నారు.ఈ మాట వైసీపీ నుంచి కూడా వినవస్తోంది.
ఎందుకంటే విపక్షం ఉంటేనే స్వపక్షం బలం ఎంతో బలహీనతలేంటో అన్నవి తెలుస్తాయని ఆ రోజు కోడెల ప్రవర్తించిన రీతిగానే ఇవాళ తమ్మినేని ప్రవర్తించడం తగదని పదే పదే కొన్ని ప్రజా సంఘాలు కూడా అంటున్నాయి.అంటే మాట్లాడే హక్కునూ మరియు మాట్లాడే స్వేచ్ఛనూ రెండింటినీ కాల రాసేందుకు స్వపక్ష ధోరణి సహకరిస్తే అంతకుమించిన అన్యాయం మరొకటి ఉండదని గతంలోనే రుజువు అయిందని,అసెంబ్లీ వేదికగా నాటి పరిణామాలకు టీడీపీ మూల్యం చెల్లించాల్సివచ్చిందని కూడా చెబుతున్నాయి హక్కుల సంఘాలు.
ఇక తాజా పరిణామాల నేపథ్యంలో సభలో వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ వాగ్వాధ ధోరణికి తావిస్తున్నారన్న కారణంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు.గీత దాటితే వేటు తప్పదు అని,ఇదివరకు చెప్పిన విధంగానే స్పీకర్ తన పని తాను చేసుకుని పోయారు.దీంతో సభలో చాలా గందరగోళ వాతావరణం నెలకొంది. స్పీకర్ నేతృత్వాన ప్రజా స్వామ్య హక్కుల పరిరక్షణ అన్నది సాధ్యం కావడం లేదని మండిపడుతూ టీడీపీ సభ్యులు మీడియా ఎదుట ఆవేదన చెందారు.