కరోనా మహమ్మారితో సతమతమవుతున్న ప్రజలపై సీజనల్ వ్యాధులు కూడా దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే వర్షాలతో భారీ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు పలు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,184 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు శ్రీనివాసరావు. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 516 కేసులు నమోదైనట్టు చెప్పారు. అలాగే, సంగారెడ్డిలో 97, కరీంనగర్‌లో 84, ఖమ్మం 82, మేడ్చల్‌లో 55, మహబూబ్‌నగర్‌లో 54, పెద్దపల్లిలో 40 చొప్పున కేసులు నమోదైనట్టు చెప్పారు శ్రీనివాసరావు.
జూన్‌లోనూ 565 కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 203 మలేరియా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు శ్రీనివాసరావు. రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్‌ల
ప్రభావం పెరుగుతోందని, సీజనల్ వ్యాధులు కూడా చుట్టుముడుతున్నాయని.. పానీపూరి లాంటి వాటివల్ల టైఫాయిడ్ వంటి వ్యాధుల బారినపడుతున్నారని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు శ్రీనివాసరావు.