తెలుగు వారి ఆరాధ్యుడు అయిన సీనియర్ ఎన్టీఆర్ ను ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు..తెలుగు వారు ఎక్కడున్నా గౌరవంగా ‘అన్న గారు’ అని పిలుస్తుంటారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయి ప్రజలకు ఎనలేని సేవలు చేశారు. ఇక సినిమా రంగంలో ధ్రువతారగా వెలుగొందిన క్రమంలోనే ఆయనను సినీ పెద్దలు, తోటి నటీనటులు వివిధ రకాల పేర్లతో పిలిచేవారు. కాగా, ఎన్టీఆర్ ను ‘అన్నగారు’ అని పిలిచిన తొలి వ్యక్తి ఎవరో ఇవాళ తెలుసుకుందాం.
క్రమశిక్షణకు మారు పేరు అయిన ఎన్టీఆర్ ను పేరు పెట్టి పిలిచేవారు ఎవరూ లేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనకున్న ప్రత్యేకత అటువంటిది కాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి సీనియర్ ఎన్టీఆర్ ను పిలిచేవారు. తాపినేని రామారావు..ఎన్టీఆర్‌ను ‘రామారావు గారు’ అని పిలిచేవారు. కమలాకర కామేశ్వర రావు..ఎన్టీఆర్ ను ఫన్నీగా ‘దొంగ రాముడు’ అని సంబోధించేవారు.
ఇక ఎన్టీఆర్ ను అభిమానులు, ప్రజలు ‘అన్నగారు’ అని పిలిచేవారు. అయితే, ఆయనను మొట్టమొదటిసారిగా ‘అన్నగారు’ అని పిలిచిన వ్యక్తి దర్శక రత్న దాసరి నారాయణరావు. అలా దాసరి నారాయణరావు సీనియర్ ఎన్టీఆర్ కు ‘అన్నగారు’ అని పేరు పెట్టారు.
దాసరి నారాయణరావు మీడియా ముఖంగా మాట్లాడుతున్న క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి ‘అన్నగారు’ అని సంబోధించారు. అలా మిగతావారు అందరూ ‘అన్నగారు’ అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా ఆంధ్ర దేశానికి ఎన్టీఆర్ ‘అన్నగారు’ అయిపోయారు.
ఇక ఎన్టీఆర్..తన స్పీచెస్ లో ఎక్కువగా ‘తెలుగు తమ్ముళ్లు’, ‘అక్కా చెల్లెళ్లు’ అని పిలవడంతో పాటు వ్యక్తిగత సంభాషణలలో ‘బ్రదర్’ అనే పదం ఎక్కువగా ఉపయోగించేవారు. ఇక ఎన్టీఆర్..నట, రాజకీయ వారసులుగా ఆయన తనయుడు బాలయ్య కొనసాగుతున్న సంగతి అందరికీ విదితమే.