ప్రముఖ హాస్య నటుడు సి.కె.నగేశ్..తనకంటూ సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. దక్షిణాది చాప్లిన్ గా ఈయనకు పేరు వచ్చింది. అభిమానులు ఈయన్ను వెండితెరపైన చూస్తే చాలు ఆనందపడేవారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో క్లాసిక్ చిత్రాలు చేసిన నగేశ్..అసలు పేరు ‘గుండూరావు’. కానీ, అభిమానులు నగేశ్ అనే పేరు చెప్తేనే గుర్తుపడతారు. ఆయనకు సీనియర్ ఎన్టీఆర్ చేసిన సాయం ఏంటో తెలుసుకుందాం.
కర్నాటకకు చెందిన నగేశ్..సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాసుకు వచ్చిన నగేశ్..భారతీయ రైల్వేలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత రంగస్థల నటుడిగా అవతారం ఎత్తి చక్కటి పేరు సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత గొప్ప హాస్య నటుడిగా ప్రఖ్యాతి గాంచారు నటుడు నగేశ్..
నగేశ్ జీవితంలో జరిగిన ఓ ఘటన వలన ఆయన లైఫ్ ఇక అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, అటువంటి టైమ్ లో సీనియర్ ఎన్టీఆర్ చేసిన సాయం వలన నగేశ్ లైఫ్ మరోలా మారింది. రంగస్థలం నుంచి వచ్చిన నగేశ్ కు ధైర్యం చాలా ఉండేది. స్వయంగా కష్టపడి పైకొచ్చిన తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అనుకునేవాడు. ఆ నేపథ్యంలోనే ఓ చిత్ర షూటింగ్ లో తమిళ్ స్టార్ హీరో ఎంజీఆర్ సెట్ కు వచ్చినపుడు లేచి నిలబడలేదు. దాంతో ఆయనకు కోపం వచ్చింది. నగేశ్ కు అవకాశాలు ఇవ్వొద్దని ఆయన చెప్పారట. దాంతో నగేశ్ కు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదు.
ఎంజీఆర్ మాటలను ఎదిరించి అవకాశాలు ఇచ్చే సాహసం ఎవరూ చేయలేదు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ నగేశ్ కు సపోర్ట్ ఇచ్చారు. తెలుగులో వరుస సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. అలా ఎన్టీఆర్ తనకు చేసిన సాయం ఎప్పుడూ గుర్తుంచుకుంటానని నగేశ్ అన్నారు. ఎన్టీఆర్ ..నగేశ్ కు అవకాశాలు ఇస్తున్నారని తెలుసుకున్న ఎంజీఆర్.. ఆ తర్వాత నగేశ్ పైన ఉన్న కోపం వదులుకున్నారట.