సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. దట్టమైన పొగ వ్యాపించి ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, మహిళ ఉన్నారు. వీరి వయసు 35 నుంచి 40 ఏళ్లలోపు అని సమాచారం. మరో పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు.
పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరిట అయిదంతస్తుల భవనం ఉంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో హోటల్ నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 9.40 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇవి వచ్చినట్లు సిబ్బంది చెబుతున్నారు. వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీనివల్ల మంటల ఉద్ధృతి మరింత పెరిగింది.
వాహనాలకు వ్యాపించడంతో పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. మెట్లమార్గం ద్వారా పైఅంతస్తులకు వ్యాపించాయి. దీనికితోడు వాహనాలు, బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందడంతో రెండు వాహనాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించాయి.