తీవ్రమైన కిడ్నీ ( Kidney ) వ్యాధులతో బాధపడుతున్న వారికి మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అదే జరిగితే వారు త్వరగా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయని.. సైంటిస్టులు తేల్చారు. ఈ మేరకు జర్మనీకి చెందిన సైంటిస్టులు ఈ విషయంపై అధ్యయనం చేపట్టారు. ఆ వివరాలను ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.
జర్మనీకి చెందిన 5110 మంది తీవ్రమైన కిడ్నీ వ్యాధులు ఉన్నవారిని కొన్నేళ్ల పాటు సైంటిస్టులు పర్యవేక్షించారు. ఈ క్రమంలో వారిలో 64.3 శాతం మందికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఇలా రెండు రకాల సమస్యలు ఉన్నవారిలో ఆరున్నరేళ్ల కాలంలో 605 మంది చనిపోగా మరో 650 మంది తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడ్డారు. అంటే వారికి హార్ట్ ఎటాక్ లు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు వచ్చాయి. అంటే కిడ్నీ వ్యాధులతోపాటు మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటే వారు త్వరగా చనిపోయే అవకాశాలు 26 శాతం ఎక్కువగా ఉంటాయని తేల్చారు. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 48 శాతం ఎక్కువగా ఉంటాయని గుర్తించారు.
మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నవారిలో నడుం చుట్టుకొలత నిర్దేశించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. షుగర్ లెవల్స్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. ట్రై గ్లిజరైడ్స్, బీపీ, ఎల్‌డీఎల్ ఎక్కువగా ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) లెవల్స్ తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ సమస్య ఉన్నవారు వాటి నుంచి బయట పడే ప్రయత్నం చేయాలని, లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.