ప్రేమ పేరుతో మోసం చేసి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి కఠిన శిక్ష పడింది. ఈ కేసు విచారించిన ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది. అంతేకాకుండా బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారంగా చెల్లించాలని నిందితుడిని ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా పోలేపల్లికి చెందిన వరికుప్పల మహేష్ సరూర్ నగర్‌లో నివాసం ఉంటూ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉండే ఓ మైనర్ బాలికను ప్రేమపేరుతో వంచించాడు. ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై సరూర్ నగర్ పోలీసులు క్రైమ్ నెంబర్ 814/2018 కింద కేసును నమోదు చేసి పోక్సో చట్టం కింద అభియోగాన్ని మోపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణలో భాగంగా పోలీసులు ఈ అభియోగాన్ని రుజువు చేయగా.. న్యాయమూర్తి నిందితుడు మహేష్ కు 20ఏళ్ల జైలు శిక్షను విధించారు.