మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా ఉద్యమం చేసి విజయం సాధించి ప్రత్యేక ప్రార్థనల కోసం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు విచ్చేస్తున్న రైతు సంఘాల నేతలను సగర్వంగా గౌరవించాలని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్‌జీపీసీ) నిర్ణయించింది. ఈ మేరకు ఎస్‌జీపీసీ అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి నేతృత్వంలో సమావేశమైన ఎస్‌జీపీసీ ఎక్సిక్యూటివ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
గోల్డెన్ టెంపుల్ ఆవరణలోని ఇన్ఫర్మేషన్ సెంటర్ వద్ద డిసెంబర్ 13న రైతు సంఘాల నేతలను సత్కరించనున్నట్టు ధామి తెలిపారు. రైతుల ఆందోళనలకు ఎస్‌పీజీసీ మద్దతు తెలిపింది. భవిష్యత్తులో కూడా కర్షకులకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. గురు గోవింద్ సింగ్ సాహిబ్జాదాస్ పక్షం రోజుల బలిదానం పురస్కరించుకొని డిసెంబర్ 21 నుంచి 30 వరకు అత్యంత సాధారణమైన ‘లంగర్’ను పెట్టాలని ఎస్‌పీజీసీ నిర్ణయం తీసుకున్నది.