పండగ వాతావరణం ఇంట్లో సందడి నింపుతున్నప్పుడు, బ్యూటీ పార్లర్‌కి పరుగులు తీసే సమయం వృథా చేసుకోవడం దేనికి? ఖరీదైన ట్రీట్మెంట్లు బ్యూటీషియన్ల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే దొరికే సహజ పదార్థాలతో మీ ముఖాన్ని అందంగా మెరిసేలా మార్చుకోవచ్చు. ఇంట్లోనే సహజమైన మెరుపును చక్కటి నిగారింపును ఎలా సాధించాలో తెలుసుకుందాం. ఈ సాధారణ చిట్కాలతో పండుగకు సిద్ధమైపోండి.
పండగ రోజున మీ చర్మం కాంతివంతంగా, తాజాగా కనిపించడానికి కొన్ని సరళమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. బ్యూటీ పార్లర్ ఫేషియల్స్ లాగానే ఇవి కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
సహజమైన క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్: కొద్దిగా పచ్చి పాలను తీసుకుని దూదితో ముఖంపై మెల్లగా తుడవండి. పాలు అద్భుతమైన సహజ క్లెన్సర్‌గా పనిచేసి, మురికిని తొలగిస్తాయి. ఒక టీస్పూన్ బియ్యం పిండిలో లేదా గోధుమ పిండిలో కొద్దిగా తేనె కలిపి ముఖం, మెడపై వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేయండి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి రక్తాన్ని మెరుగుపరుస్తుంది. రెండు నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.

మసాజ్, టోనింగ్: ఒక టీస్పూన్ బాదం నూనె లేదా కొద్దిగా అలోవెరా జెల్‌ను తీసుకుని ముఖంపై, ముఖ్యంగా కళ్ల చుట్టూ 5 నిమిషాలు మసాజ్ చేయండి. ఇది చర్మంపై రక్త ప్రసరణను పెంచి, తక్షణ కాంతిని ఇస్తుంది. కొద్దిగా రోజ్ వాటర్‌ను దూదిలో తీసుకుని ముఖంపై రాసి చర్మాన్ని తాజాగా మార్చండి.
గ్లో ప్యాక్: ఒక గిన్నెలో ఒక టీస్పూన్ శనగ పిండి, అర టీస్పూన్ పసుపు (కస్తూరి పసుపు ఉత్తమం), ఒక టీస్పూన్ పెరుగు లేదా పాలు మరియు కొద్దిగా నిమ్మరసం (సున్నితమైన చర్మం అయితే నిమ్మరసం వద్దు) కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి, పూర్తిగా ఆరిపోయే వరకు (సుమారు 15-20 నిమిషాలు) ఉంచండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చర్మంపై అద్భుతమైన మెరుపు కనిపిస్తుంది.
పార్లర్ ఖర్చులు, సమయాన్ని ఆదా చేస్తూ, మీ వంటగదిలోని సహజ పదార్థాలతో అత్యంత సురక్షితమైన మరియు మెరిసే ముఖాన్ని పొందడం ఎంత సులభమో చూశారు కదా.. ఈ చిన్న చిట్కాలను పండుగకు ముందు రోజు లేదా పండుగ రోజు ఉదయం పాటించండి. మీ చర్మం సహజమైన నిగారింపుతో మెరిసిపోవడం ఖాయం. ఆ పండుగ వెలుగు మీ ముఖంలోనూ ప్రకాశిస్తుంది.
గమనిక: సున్నితమైన చర్మం ఉన్నవారు పసుపు, నిమ్మరసం వాడే ముందు ప్యాచ్ టెస్ట్ (చిన్న ప్రదేశంలో రాసి చూడటం) చేసుకోవడం మంచిది. అలాగే ఉత్తమ ఫలితాల కోసం ఈ ప్రక్రియ అంతా ప్రశాంతంగా సున్నితంగా చేయండి.