శివసేన,అర్నాబ్ వార్ మరింత ముదిరిందా…!

-

శివసేన ప్రభుత్వానికి, అర్నాబ్‌కు మధ్య జరుగుతున్న పోరాటం.. పీక్స్‌కు చేరింది. అర్నాబ్‌ అరెస్ట్ అయ్యారు. ఇంకా బెయిల్‌ దొరకలేదు. ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది. అసలు ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ? అర్నాబ్‌.. ఓవరాక్షన్‌ తట్టుకోలేని స్థాయికి చేరిందా ? ఇప్పుడు ఈ అంశాల పైనే ఇటు మీడియా అటు పొలిటికల్ సర్కిల్స్ లో హట్ హాట్ గా చర్చ నడుస్తుంది.


తమకు చికాకు పెడుతున్న అర్నాబ్‌ను ఎలాగైనా కంట్రోల్‌ చేయాలనుకున్న శివసేన సర్కార్‌.. పాత కేసుల్ని తిరగదోడింది. ఈ సందర్భంలోనే గతనెలలో టీఆర్పీ స్కాం కేసు, ఇప్పుడు అన్వయ్‌ కేసు బయటకు వచ్చాయి. చివరికి శివసేన తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. అర్నాబ్ గోస్వామిని అరెస్ట్‌ చేసేసింది..ఈ కేసులో అర్నబ్‌ను అరెస్ట్‌ చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా.. ఆయనకు 14 రోజులు రిమాండ్‌ విధించడంతో… జైలుకు తరలించారు.

అన్వయ్‌ కేసులో అర్నాబ్‌ను అరెస్ట్‌ చేయడం సంచలనం సృష్టించింది. అందుకు కారణం.. గత కొద్దిరోజులుగా మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంతో అర్నాబ్‌ గోస్వామి ఢీ అంటే ఢీ అంటున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రేపై విరుచుకుపడుతున్నారు. మహా సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దమ్ముంటే చూసుకుందాం.. నన్ను అరెస్ట్‌ చేయండి అంటూ టీవీ స్టూడియోల్లో విరుచుకుపడ్డారు…అర్నాబ్‌ అరెస్ట్‌ వెనుక రాజకీయ కారణాలు క్లియర్‌గా ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీని కాదని.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో బాలీవుడ్ హీరో సుశాంత్‌ మృతి కేసు, అందులోని డ్రగ్స్‌ కోణం బయటకు వచ్చాయి.

ఈ సందర్భంలోనే అర్నాబ్‌.. బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో శివసేన సర్కార్‌ను టార్గెట్‌ చేసుకున్నారు. కంగనా రనౌత్‌, శివసేన మధ్య వివాదంతో మరింత అగ్గి రాజేసింది. తమ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న అర్నాబ్‌కు చెక్‌ పెట్టడానికి ఉద్ధవ్‌ సర్కార్‌ అన్ని ప్రయత్నాలు చేసింది. చివరికి ఆయనతో ఇప్పుడు ఊచలు లెక్కబెట్టిస్తోంది. అర్నబ్‌ గోస్వామి అరెస్ట్‌పై దేశవ్యాప్తంగా భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆయన అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. మరికొందరు ఆయన పాపం పండిందని అంటున్నారు. సోషల్‌ మీడియాలో కూడా మిక్స్‌డ్‌ రియాక్షన్స్‌ వస్తున్నాయి.

అర్నాబ్‌ గోస్వామి చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. ఆయన డిబేట్లు నిర్వహించే తీరు.. తీవ్ర చర్చనీయాంశమే. చర్చల్లో అరుపులు, కేకలు.. డిబేట్‌లో పాల్గొనేవారిపై అర్నాబ్‌ మండిపడటం.. ఇలా ఒక ట్రెండ్‌ క్రియేట్‌ చేశాడు. మామూలుగా చర్చలు అంటే అర్ధవంతమైన చర్చ, విభిన్న వాదనలు ఉంటాయి. కానీ, అర్నాబ్‌ చర్చల్లో అలాంటి వాటికన్నా.. అరుచుకోవడాలు, తిట్టుకోవడాలే. అంతేకాకుండా చర్చల్లో పాల్గొనే వారికంటే ఎక్కువగా.. అర్నాబే వాదిస్తూ ఉంటారు.చర్చలు నిర్వహించే జర్నలిస్టులు సంయమనంతో ఉండాలి. ఏ వర్గానికి, ఏ పార్టీకి మద్దతు పలకకుండా అర్ధవంతమైన చర్చ నిర్వహించాలి. కానీ అర్నాబ్‌.. ఈ రూల్స్‌ అన్నింటినీ ఎప్పుడో బ్రేక్‌ చేశారు.

ఇన్నేళ్లుగా అర్నబ్‌ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. అది నడిచిపోయింది. అయితే ఎప్పుడైతే మహారాష్ట్ర సర్కార్‌తో పెట్టుకొని.. సీఎం ఉద్ధవ్‌ని స్టూడియోలో కూర్చొని సవాల్‌ చేసారో.. అప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి విమర్శలపాలైంది.బీజేపీ అజెండాను భూజానికెత్తుకొని శివసేనను టార్గెట్‌ చేసిన తీరును చాలామంది తప్పుబడుతున్నారు. అర్నాబ్ ఓ చవకబారు జర్నలిస్టని, బీజేపీ నుంచి సుపారి తీసుకుని పనిచేస్తాడని, అతని డ్రామాలను సహించాల్సిన అవసరం ప్రజాప్రభుత్వాలకు లేదని సామ్నాలో శివసేన మండిపడింది. మొత్తానికి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version