నటుడు, బిగ్ బాస్ మొదటి సీజన్ విజేత శివబాలాజీ వార్తల్లోకెక్కాడు. విద్యార్థుల నుండి ఇష్టం వచ్చినట్టుగా ఫీజు వసూలు చేస్తుందంటూ మణికొండలోని ఓ పాఠశాలపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసారు. ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఇష్టం వచ్చినట్టుగా ఫీజు వసూలు చేయడం సరికాదని, దానికోసం అనవసర పరీక్షలు పెట్టి ఫీజు వసూలు చేస్తున్నారని అన్నాడు. ఈ విషయమై మీడియా ముందుకు వచ్చిన శివబాలాజీ పాఠశాల యాజమాన్యంపై చాలా సీరియస్ అయ్యాడు.
ఫీజు అధికంగా వసూలు చేయడమే కాకుండా, దాని గురించి మాట్లాడిన వాళ్లని బెదిరిస్తున్నారని, ఇంకా మాట్లాడటానికి ప్రయత్నిస్తే విద్యార్థుల ఐడీలు బ్లాక్ చేస్తుందని, వారికి ఆన్ లైన్ క్లాసులు అందకుండా చేస్తుందని ఆరోపణలు చేసాడు. ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్న శివబాలాజీ స్కూలు యాజమాన్యానికి గట్టిగా హెచ్చరించాడు. మరి శివబాలాజీ చేసిన ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.