భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి గట్టి షాక్ తగలనుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. అతి త్వరలోనే అతను కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లి స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో అతను వన్డేలు, టీ20ల కెప్టెన్‌గా తప్పుకుని ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగిస్తాడని తెలుస్తోంది.
అయితే విరాట్ కోహ్లి తనంతట తానుగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని తెలుస్తున్నప్పటికీ అసలు విషయం అది కాదని సమాచారం. ప్రస్తుతం అతను భారత్‌కు మూడు ఫార్మాట్ల క్రికెట్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో అతనిపై తీవ్రమైన ఒత్తిడి పడుతుందని తెలుస్తోంది. అందుకనే అతన్ని వన్డేలు, టీ20ల కెప్టెన్‌గా తప్పించి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తే కోహ్లిని పొమ్మనలేక పొగబెట్టినట్లు అందరూ భావిస్తారు. అందుకనే ఆ నిర్ణయాన్ని స్వయంగా అతనే చెప్పేట్లు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ అనంతరం కోహ్లి స్వయంగా వన్డేలు, టీ20ల కెప్టెన్‌గా తప్పుకోనున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడని సమాచారం అందుతోంది.
ఇక వన్డేలు, టీ20లతోపాటు ఐపీఎల్‌లో రోహిత్ శర్మ కెపెన్ గా మంచి రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో అతని సారథ్యంలో ముంబై 5 టైటిల్స్ ను గెలుచుకుంది. అలాగే ప్లే ఆఫ్స్ కు 8 ఎడిషన్‌లలో 6 సార్లు వెళ్లింది. ఇక వన్డేల్లో రోహిత్ కెప్టెన్సీలో భారత్ 10 వన్డేలు ఆడగా 8 మ్యాచ్‌లలో గెలుపొందింది. టీ20లు అయితే 19 మ్యాచ్‌లలో 15 మ్యాచ్‌లు గెలిచింది. రోహిత్ కెప్టెన్‌గా ఇప్పటికే అనేక టోర్నీల్లో తనను తాను రుజువు చేసుకున్నాడు. పైగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. అందుకనే అతన్ని వన్డేలు, టీ20లకు కెప్టెన్ గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీ20 వరల్డ్ కప్ ముగిస్తే గానీ ఈ విషయంపై స్పష్టత రాదు.