ఒక్క నౌక ఆగిపోతే…ప్రపంచానికి కోట్లలో నష్టం జరుగుతుందా…?

-

సూయెజ్‌ కెనాల్‌లో ట్రాఫిక్‌ జామ్‌ కు కారణం ఏంటీ..ఒక్క నౌక ఆగిపోతే ఎక్కడికక్కడ ప్రయాణాలు నిలిచిపోతాయా కోట్లలో నష్టం జరుగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. పెద్ద పెద్ద నౌకల్లో జలమార్గాల్లో సరుకు రవాణా చేయడం సాధారణం. అయితే సూయేజ్ కాలువలో కంటెయినర్‌ షిప్‌ ఇరుక్కుపోవడంతో గంటకు సుమారు 3వేల కోట్ల నష్టం జరగడం అన్నది ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అసలు ఆ ప్రాంతంలో షిప్పు ఇరుక్కుపోయిందా కావాలనే చేశారా అన్నది మిస్టరీగా మారింది.

పనామా కాలువ నుంచి వెళ్లలేని అతిపెద్ద కంటెయినర్‌ షిప్‌ ఎవర్‌ గివెన్‌ చైనా నుంచి నెదర్లాండ్స్‌ వెళ్లేందుకు సూయెజ్‌ కాలువ ను ఎంచుకుంది. నౌక ప్రయాణించే సమయంలో పెను గాలులు వీచడంతో ఎవర్‌ గివెన్‌ నౌక ఒక్కసారిగా కెనాల్‌పై అడ్డంగా తిరిగి ఉండిపోయింది. ఈ నౌకలో వందలాదిగా కంటెయినర్లు ఉండిపోయాయి. సూయజ్‌ కాలువపై రవాణా మొత్తం స్తంభించిపోయింది. నౌకను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు రెండు రోజులుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం వ్యాపారం ఈ కాలువ ద్వారానే జరుగుతుంది. 8 శాతం సహజ వాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా అవుతోంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ సరఫరా అవుతోంది. ప్రస్తుతం షిప్ ఇరుక్కుపోవడంతో గంటకు సుమారు 3వేల కోట్ల నష్టం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పు ఉన్న ఈ అతి భారీ సూయెజ్‌ కాలువ ముఖద్వారంలో చిక్కుకుపోయింది. ఈ నౌకను దారిలో పెట్టడానికి కొన్ని రోజులు పట్టోచ్చని ఈజిప్టులోని కెనాల్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

2 లక్షల 20 వేల టన్నుల బరువైన నౌకను కదలిస్తే తప్ప ప్రస్తుతం ఆ మార్గంలో ఆగిపోయి ఉన్న సౌదీ, రష్యన్, ఒమన్, యు.ఎస్‌. ఇంధన ట్యాంకర్లు ఓడ రేవులకు చేరుకోవు. రోజూ కనీసం 50 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ప్రస్తుతం చిన్న పెద్ద కలిపి వందకు పైగా నౌకలు నిలిచిపోయాయి. గతంలో ఇలాంటివి జరిగినా ఐదారు గంటల్లో రద్దీని తొలగించేవారు. కానీ ప్రస్తుతం రెండు రోజులు దాటినా… ఒక్క ఇంచు కూడా కదిలించలేకపోయారు. టగ్‌ బోట్లు, డిగ్గర్లు 24 గంటలు పనిచేస్తూనే ఉన్నాయి.

సూయెజ్‌ కాల్వలో నౌకాయానం నిలిపివేయడం 20 ఏళ్లలో ఇది మూడోసారి. అయితే ఎవర్‌ గివెన్‌ నౌక కాల్వ ఒడ్డును ఢీకొని అందులో కూరుకుపోవడంతో సమస్య తీవ్రంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version