TSPSC పేపర్‌ లీకేజీ.. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ప్రశ్నించిన సిట్‌

-

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓవైపు నిందితులను ప్రశ్నిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో సిట్ అధికారులు ఇవాళ విచారణ చేపట్టారు. ఐదు బృందాలుగా ఏర్పడిన అధికారులు మల్యాల మండలంలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ప్రశ్నించారు.

దాదాపు 40మంది ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినట్లు ప్రాథమికంగా గుర్తించిన సిట్ అధికారులు వారి ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. అభ్యర్థుల విద్యార్హతలు, గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులు, ఎక్కడ శిక్షణ తీసుకున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు, బంధువులు, స్నేహితుల వివరాలను సేకరించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డితో అభ్యర్థులకు ఏమైనా స్నేహం, బంధుత్వం ఉందా అనే కోణంలోనూ ఆరా తీశారు.

రాజశేఖర్ రెడ్డి స్వగ్రామమైన తాటిపల్లిలోనూ సిట్ అధికారులు విచారించారు. మల్యాల మండలంలో వంద మందికి 100 మార్కులకు పైగా వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సిట్ అధికారులు మల్యాల మండలానికి చెందిన గ్రూప్-1 అభ్యర్థులపై దృష్టి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version