TSPSC పేపర్ లీకే కేసులో సిట్ అధికారులు నెలరోజుల పాటు దర్యాప్తు చేసిన నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఈ దర్యాప్తు నివేదికలో సిట్ కీలక విషయాలు పొందుపరిచింది. లీకేజీ నిర్వాకంలో చోటు చేసుకున్న ఆర్థిక లావాదేవీల చిట్టాను అధికారులు గుర్తించారు. నిందితుల అక్రమార్జన గుట్టురట్టు చేశారు.
కేసులో కీలక నిందితుడు ప్రవీణ్ ఏఈ ప్రశ్నపత్రాన్ని అమ్మేందుకు రూ.10 లక్షలకు బేరం పెట్టినా.. తర్వాతి దశలో అది మరో రూ.40 లక్షల లావాదేవీలకు దారితీసినట్లు సిట్ గుర్తించింది. వాస్తవానికి తన సోదరుడు రాజేశ్వర్ కోసమంటూ రేణుక ఏఈ ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్ నుంచి కొనుగోలు చేసింది. కానీ రాజేశ్వర్ అసలు పరీక్షే రాయలేదు. కానీ ఆ ప్రశ్నపత్రాలను మాత్రం మరో నలుగురికి విక్రయించేందుకు రూ.10లక్షల చొప్పున బేరం పెట్టాడు. వారిలో ఒక్కరు మాత్రమే రూ.8 లక్షలు చెల్లించారు. మిగిలిన వారిలో ముగ్గురు రూ.5 లక్షల చొప్పున ముట్టజెప్పారు.
వాటిలో నుంచి రాజేశ్వర్ తన అప్పు తీర్చేందుకు రూ.5-6 లక్షలను వెచ్చించాడు. మరో రూ.6-7లక్షలతో డ్రైనేజీ నిర్మాణం.. హైమాస్ట్ లైట్ల ఏర్పాటు వంటి కాంట్రాక్టు పనులను నిర్వహించాడు. ఈ క్రమంలో అప్పు తీర్చేందుకు రాజేశ్వర్ చెల్లించిన సొమ్మును స్వాధీనం చేసుకునేందుకు నోటీసు ఇచ్చే యోచనలో సిట్ ఉంది.