సిత్రాంగ్ తుపాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పులేదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉత్తర, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడం ఉత్తర, పశ్చిమ దిశలలో ప్రయాణించి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారిందని వెల్లడించింది.
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం తుపానుగా మారుతుందని ఏపీ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. అక్టోబర్ 24 ఒడిశా తీరాన్ని చేరుకుని, అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య సిత్రాంగ్ తుపాను తీరం దాటుతుందని అంచనా వేశారు. సిత్రాంగ్ తుపాను, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వెల్లడించారు.
వాయుగుండం తుపానుగా మారడంతో మరో మూడు రోజుల వరకు ఏపీలో పలు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. త్వరలోనే ఈశాన్య రుతుపవనాలు ఏపీలో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తాయని తెలిపింది.