ఏడాదిలోపు పిల్లల్లో నిద్ర సమస్యలు.. బాల్యంలో మానసిక రుగ్మతలకు సంకేతాలు!

-

మీకు ఏడాదిలోపు వయసున్న పిల్లలు ఉన్నారా? వారు కడుపునిండా పాలు తాగి హాయిగా నిద్రపోతున్నారా? ఆకలివేస్తే తప్ప ఏడవడం లేదా? అయితే మీరు నిశ్చింతంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడూ ఏడుస్తూ కంటినిండా నిద్రపోని పసిపిల్లల తల్లిదండ్రులకు మాత్రం శాస్త్రవేత్తలు ఒక చేదు నిజం చెబుతున్నారు. నిద్రలేమితో బాధపడే పసికందులు బాల్యంలో మానసిక రుగ్మతల బారినపడే ప్రమాదం ఉందని వారు తమ పరిశోధనల్లో తేల్చారు.

శాస్త్రవేత్తలు ఆస్త్రేలియాకు చెందిన 1507 మంది తల్లులు, వారి పసిబిడ్డలపై ఈ పరిశోధన చేశారు. పిల్లలకు 3 నెలలు, 6 నెలల వయసు వచ్చినప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా, 9 నెలల వయసులో నేరుగా, తిరిగి 12 నెలల వయసప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా తల్లులను సంప్రదించారు. వారి పిల్లల్లోని నిద్రసంబంధ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నాలుగేండ్ల వయసులో, పదేండ్ల వయసులో పిల్లల మానసిక పరిస్థితిని పరిశీలించారు.

ఈ రిసెర్చ్‌ ద్వారా పరిశోధకులు ఒక కొత్త విషయం కనిపెట్టారు. ఏడాదిలోపు వయసులో నిద్రసంబంధ సమస్యలతో బాధపడ్డ పిల్లలు బాల్యంలో రకరకాల మానసిక రుగ్మతల బారిన పడినట్లు గుర్తించారు. పసితనంలో కంటినిండా నిద్రపోయిన పిల్లలు మాత్రం బాల్యంలో మానసికంగా ధృఢంగా, చురుకుగా ఉన్నట్లు వెల్లడించారు.

ఏడాదిలోపు వయసులో ఎలాంటి నిద్ర సమస్యలు లేని పిల్లలతో పోల్చితే, నిద్ర సమస్యలతో బాధపడిన పిల్లల్లో భావోద్వేగాల స్థాయి ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. నాలుగేండ్ల వయసులో మూడు రెట్లు, పదేండ్ల వయసులో మరో రెండు రెట్లు భావోద్వేగాల స్థాయి పెరిగినట్లు గుర్తించారు. దీన్నిబట్టి నిద్రలేమి సమస్యలు ఎదుర్కొన్న పిల్లల్లో నాలుగేండ్ల వయసుతో పోల్చితే పదేండ్ల వయసులో భావోద్వేగాల స్థాయి మరింత పెరిగింది.

పసితనంలో నిద్రసమస్యలు ఎదొర్కొన్న పిల్లలకు బాల్యంలో రకరకాల మానసిక రుగ్మతలు బయటపడినట్లు పరిశోధకులు గుర్తించారు. ఒంటరి తనాన్ని ఇష్టపడటం, నలుగురిలోకి వెళ్లాలంటే భయపడటం, అనవసరంగా బాధపడటం, ఎప్పుడూ ఒత్తిడితో కనిపించడం, ఉన్నట్టుండి అగ్రిసివ్‌గా మారడం, చికాకు పడటం, గాయపడతామన్న భయంతో ఆడుకోవడానికి కూడా వెనుకాడటం లాంటి లక్షణాలను పిల్లల్లో గుర్తించినట్లు తెలిపారు.

అయితే, బాల్యంలో కనిపించే ఈ మానసిక సమస్యలు ఆ తర్వాత కూడా కొనసాగుతాయా లేక తగ్గిపోతాయా? అనే విషయాన్ని మాత్రం పరిశోధకులు వెల్లడించలేదు. మరోవైపు పసితనంలో నిద్ర సమస్యలు బాల్యంలో మానసిక సమస్యలకు ఎందుకు దారితీస్తాయన్న విషయాన్ని కూడా వారు స్పష్టం చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news