నియోజకవర్గాల్లో రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అంచనా వేయలేకపోతుంది. పార్టీ జెండాను ఇన్నాళ్లు మోసిన వారు ఇప్పుడు కొందరి వైఖరి దెబ్బకు పార్టీని వీడుతున్నారు. రాజకీయంగా బలహీనంగా ఉన్న సమయంలో కొందరి వైఖరి మారకపోవడం, అధినేత చంద్రబాబు అవకాశ వాదులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వంటివి కొందరు జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని టీడీపీ ఎంత ప్రచారం చేసినా జగన్ ముందు ఇంకా ఎలా లేదనుకున్నా మూడేళ్లకు పైగా సమయం ఉంది.
దీనితో ప్రభుత్వంపై ఇప్పుడు వ్యతిరేకత ఉన్నా సరే సరైన వ్యూహం ఉంటే దాని నుంచి బయటపడటం పెద్ద విషయం కాదు. అది పక్కన పెడితే ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నా.. దానిని ప్రజల్లోకి ఎంత వరకు తీసుకువెళ్తున్నా… గ్రామాల్లో మాత్రం పరిణామాలు అందుకు చాలా భిన్నంగా ఉన్నాయి అనేది వాస్తవం. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు రానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పుంజుకునే అవకాశం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి చెప్పినా అందుకు తగిన పరిస్థితులు మాత్రం అక్కడ కనపడటం లేదు.
వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమలోనే కాదు టీడీపీకి పట్టున్న గోదావరి జిల్లాల్లో సైతం టీడీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరికే అవకాశం కనపడటం లేదు. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబుకి వస్తున్న కొన్ని ఫిర్యాదులు, నివేదికలు చుక్కలు చూపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
అటు నియోజకవర్గాల ఇంచార్జులు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారనే వార్తలు ఇప్పుడు కార్యకర్తలను కూడా కలవరపెడుతున్నాయి. మరి అధిష్టానం చెప్పినట్టు వ్యతిరేకత ఉంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో…? ఇంకా చెప్పాలంటే ఇప్పటికే నాలుగు నెలల్లో జగన్ చేపడుతోన్న సంస్కరణల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు కూడా ఎవ్వరు ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో అధిష్టానం సైతం తలలు పట్టుకుంటోంది. మరి ఇప్పుడు టీడీపీని కాపాడే ఆ నాయకులు ఎవరో ?