2024 ఎన్నికల కోసం సోమిరెడ్డి ఇప్పటినుంచే స్కెచ్..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ పడటం, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు వంటి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాల విభజన.. నెల్లూరు జిల్లాలో ఆ సీనియర్ నాయకుడికి ఇబ్బందిగా మారబోతుంది. అందుకే ఆయన నియోజకవర్గాన్ని మారే ఆలోచనలో పడ్డారు. అందుకోసం తగిన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఏపీలో జిల్లాల విభజన చాలా మంది నాయకుల రాజకీయ భవిష్యత్తును మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని సామాజికవర్గాల పట్టు తప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ విషయాన్ని గ్రహించిన పలువురు నేతలు సఫ్‌ గేమ్‌ ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ ‌రెడ్డి నియోజకవర్గ మార్పులో ఉన్నట్లు టీడీపీలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఎప్పటి నుంచో సోమిరెడ్డి పోటీ చేస్తున్న సర్వేపల్లి.. తిరుపతి లోక్ ‌సభ పరిధిలో ఉంది. తిరుపతి జిల్లా అయితే.. నెల్లూరు జిల్లాతో సోమిరెడ్డికి సంబంధాలు తెగిపోతాయి. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సొంతూరు అల్లాపురం నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు కూడా ఉంది. అదే అదునుగా భావించిన సోమిరెడ్డి.. సర్వేపల్లి నుంచి నెల్లూరు రూరల్‌ కు మారే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నుంచి మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడినా అజీజ్‌ చురుకుగానే ఉన్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి కాకుండా నెల్లూరు రూరల్‌ నుంచి పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సోమిరెడ్డి వర్గం భావించింది. వాస్తవానికి సర్వేపల్లిలో వరుస ఓటములు పలకరించాయి. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా జనాలు ఎందుకు ఓడిస్తున్నారో ఆయనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని… భవిష్యత్‌ ను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గం మార్చుకుంటే బెటర్‌ అని అనుచరులు సూచిస్తున్నారని కూడా సమాచారం.

ఇదే సమయంలో మరో టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉండటంతో.. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీడీపీ అధిష్ఠానం చెవిలో కూడా సోమిరెడ్డి పడేశారంట. పనిలో పనిగా నియోజకవర్గం మార్పుపై కూడా ప్రస్తావించారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి తాను నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని.. నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ టికెట్‌ తన కుమారుడి రాజగోపాల్ ‌రెడ్డికి కేటాయించాలని ఇప్పటి నుంచే పార్టీ పెద్దలకు చెప్తూ వస్తున్నారని కూడా తెలుస్తోంది.

కాగా నెల్లూరు రూరల్‌ లో అబ్దుల్‌ అజీజ్‌ మాత్రం వీరి మాట వినడం లేదని తెలుస్తోంది. మరి ఇలాంటి సమయంలో సోమిరెడ్డి ఏం చేస్తారు? నెల్లూరును వదిలేసుకుంటారా? లేకా ఎన్నికలకు ఇంకా టైమ్‌ ఉందని వేచి చూస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version