మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఇది సత్యం మరియు అహింస విజయం అని ఆమె అభివర్ణించారు. ఈ రోజు, న్యాయం కోసం ఈ పోరాటంలో తమ సభ్యులు తమ ప్రాణాలను అర్పించిన 700 మందికి పైగా రైతు కుటుంబాల త్యాగం ఫలించింది. ఈరోజు సత్యం, న్యాయం, అహింస గెలిచాయని ఆమె అన్నారు. రైతులు, కూలీలపై అధికారంలో ఉన్నవారు పన్నిన కుట్ర, నియంతృత్వ పాలకుల దురహంకారం ఓడిపోయిందని సోనియా గాంధీ అన్నారు. బీజేపీ రైతుల జీవనోపాధి,వ్యవసాయంపై దాడికి కుట్ర పన్నింది. ఈరోజు అన్నదాతలు గెలిచారు అని అన్నారు. ప్రజాస్వాయ్యంలో ఏ నిర్ణయమైనా ప్రజలు, ప్రతిపక్షాలతో చర్చించి తీసుకోవాలి.. ఇప్పటికైనా బీజేపీ ఇది నేర్చకోవాలని హితవు పలికారు. గత ఏడేళ్లుగా బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై దాడులు చేస్తుందని ఆరోపించారు సోనియా గాంధీ.
అంతకుముందు ఈరోజు ఉదయం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. తాము రైతుల శ్రేయస్సు కోసమే వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చామని వెల్లడించారు. మేం ఈ విషయాన్ని రైతులకు వివరించలేకపోయాం అని మోదీ అన్నారు. రైతులను కష్టపెట్టినందుకు క్షమించాలి అని మోదీ అన్నారు.