ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు బెంబేలెత్తిపోతున్న ప్రజలకు అమెరికా సైంటిస్టులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై కేవలం 45 నిమిషాల్లోనే కరోనా టెస్ట్ రిజల్ట్‌ను ఇచ్చే ఓ నూతన పరికరాన్ని వారు తయారు చేశారు. దీంతో చాలా తక్కువ వ్యవధిలోనే ఎవరికైనా కరోనా ఉందీ, లేనిదీ సులభంగా గుర్తించవచ్చు. వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాగా ఈ పరికరానికి ఇప్పటికే అమెరికాలోని ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ఓకే చెప్పేసింది. దీంతో ఈ నెల చివరి వరకు ఈ పరికరం వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం కరోనా పరీక్ష రిజల్ట్ రావాలంటే కనీసం 24 నుంచి 36 గంటల పాటు ఆగాల్సి వస్తోంది. దీని వల్ల ఒకరి నుంచి మరొకరికి కరోనా సులభంగా వ్యాప్తి చెందుతోంది. అయితే అమెరికా సైంటిస్టులు తయారు చేసిన ఆ పరికరం వల్ల కేవలం 45 నిమిషాల్లోనే కరోనా టెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇక ఆ పరికరాన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. పెద్ద ఎత్తున ఒకేసారి కరోనా పరీక్షలు చేయవచ్చు. కాలిఫోర్నియాలోని సైఫైడ్ అనే సంస్థకు చెందిన సైంటిస్టులు ఈ పరికరాన్ని తయారు చేశారు. మార్చి 30 వరకు ఈ పరికరం మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.
కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 3 లక్షలు దాటగా, 13,068 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఈ క్రమంలో ఆదివారం మన దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు.