కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 5.0ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 30వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ అమలవుతుంది. అయితే ఇప్పటికే దేశంలో ప్రజారవాణాకు అనుమతి ఇవ్వడంతో బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరుగుతున్నాయి. ఇక తెలంగాణ, ఏపీల్లో ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డెక్కాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ బస్సులను తిప్పుతున్నారు. అయినప్పటికీ ఆర్‌టీసీ బస్సులో వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఆర్‌టీసీ బస్సుల్లో క్యాష్ ఉంటేనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ఇపై చేతిలో నగదు లేకున్నా బస్సుల్లో ప్రయాణం చేసేందుకు వీలు కల్పించనున్నారు.
దేశవ్యాప్తంగా ప్రజలందరూ డిజిటల్ బాట పట్టారు. కరోనా పుణ్యమా అని డిజిటల్ చెల్లింపులు ప్రస్తుతం పెరిగాయి. అందరూ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాలెట్లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే త్వరలో ఆర్‌టీసీలోనూ డిజిటల్ చెల్లింపులకు అనుమతివ్వనున్నారు. ప్రయాణికులు బస్సులో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించి టిక్కెట్లు తీసుకోవచ్చు. అందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ లను సిద్ధం చేస్తోంది. ప్రతి బస్సుకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కండక్టర్ వద్ద ఉంటుంది. దాన్ని ప్రయాణికులు స్కాన్ చేసి గూగుల్ ఫే, ఫోన్ పే లేదా పేటీఎం ద్వారా తమ టిక్కెట్‌కు అయ్యే మొత్తాన్ని చెల్లించవచ్చు.
ఇలా డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో మరింత సేఫ్‌గా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. అయితే తెలంగాణ ఆర్‌టీసీ ప్రస్తుతం ఈ విధానంపై కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ విధానాన్ని బస్సుల్లో అమలు చేయనున్నారు. కాగా కర్ణాటకలో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. కరోనా నేపథ్యంలో ప్రయాణికులకు మరింత సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్ఆర్‌టీసీ నడుం బిగించింది.