ప్రముఖ సిపిఐ(ఎం) నాయకుడు అశోక్ భట్టాచార్య సంచలన వ్యాఖ్యలు చేసారు. బిసిసిఐ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లో చేరే క్రమంలో ఒత్తిడిలో ఉన్నారని, కొంతమంది ఆయనను రాజకీయ లాభాల కోసం ఉపయోగించాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. సౌరవ్ గంగూలీ ఇటీవల కోల్‌కతాలో తేలికపాటి గుండెపోటుతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఆ తరువాత ఆయనకు యాంజియోప్లాస్టీ చేయించుకున్నాడు.
ఈ ఏడాది బెంగాల్ ఎన్నికలకు ముందు, సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే గంగూలీ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన రాజకీయ నాయకుడు కాదు… కేవలం సౌరవ్ స్పోర్టింగ్ ఐకాన్ అని అన్నారు. ” మనం ఆయనపై రాజకీయాల్లో చేరడానికి ఒత్తిడి చేయకూడదు. రాజకీయాలలో చేరకూడదని నేను గత వారం సౌరవ్‌తో చెప్పాను” అని అన్నారు.
ఆయన నా అభిప్రాయాన్ని వ్యతిరేకించలేదని అన్నారు. గంగూలీని ఆయన ఆస్పత్రిలో పరామర్శించారు. అయితే అశోక్ వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మండిపడ్డారు. “కొంతమంది ప్రజలు తమ అనారోగ్య మనస్తత్వం కారణంగా ప్రతిదానిలోనూ రాజకీయాలను చూస్తారు. లక్షలాది మంది అభిమానుల మాదిరిగానే సౌరవ్ పూర్తిగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు. ఆసుపత్రిలో గంగూలీని పరామర్శించిన సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి శోభండేబ్ ఛటర్జీ మాట్లాడుతూ, సౌరవ్‌ను “మా పార్టీలోకి చేర్చే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు.” అని అన్నారు.