కేరళ రాజధాని తిరువనంతరపురం వేదికగా కౌన్సిల్ 30వ సమావేశం నేడు జరగనుంది. విద్యుత్ బకాయిలు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, విభజన హామీలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో రాష్ట్ర బృందం కౌన్సిల్ సమావేశానికి హాజరు కానుంది. విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, నీటిపారుదల అంశాలపై దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలని రాష్ట్ర బృందాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం లేదు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంతో పాటు తెరాస శాసనసభా పక్ష సమావేశం సైతం ఉండటంతో సీఎం వెళ్లడం లేదు. విభజన వ్యవహారాలు చూస్తున్న ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు కౌన్సిల్ సమావేశం ఎజెండాలో ఉన్న నీటిపారుదల, విద్యుత్, హోంశాఖల నుంచి అధికారులు వెళ్లనున్నారు. విద్యుత్ బకాయిల అంశం చర్చకు రానుంది.