చైనా సహా ప్రపంచంలోని పలు దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కట్టడి కోసం గురువారం చిలుకూరు బాలాజీ దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 2000 మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్‌తో కలిసి భక్తులు అపామార్జన స్తోత్రం, సుదర్శన అష్టకం పఠించారు.
‘కరోనా వైరస్ చైనాతోపాటు పలు దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అందుకే ప్రపంచ దేశాలను పట్టి్ పీడిస్తున్న ఈ మహమ్మారిని పారదోలమని భగవంతుడిని ప్రార్థించాం. ముఖ్యంగా భారతదేశంలో ఈ వ్యాధి ప్రబలకుండా చూడమని కోరుకున్నాం. మా మొర ఆలకించమని అందరు దేవుళ్లనూ వేడుకున్నాం.’ అని పూజారి రంగరాజన్ చెప్పారు.
ప్రాణాంతక కరోనా బారినపడి చైనాలో ఇప్పటికే 565 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేగాదు.. చైనా సహా పలు దేశాల్లో దాదాపు 20,000 మంది కరోనా సోకి ఆస్పత్రుల పాలయ్యారు. మరోవైపు కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో చైనాలోని 12కు పైగా నగరాల్లో ప్రయాణాలపై నిషేధం విధించారు. దీంతో దాదాపు 5.60 కోట్ల మంది ఇళ్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.