గత బీఆర్ఎస్ పభుత్వంలో రిలీజ్ చేసిన జీవో 317 అమలుతో స్థానికత కోల్పోయి నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని తిరిగి వారి సొంత జిల్లాలకు పంపాలని కోరుతూ 317 జీవో సబ్ కమిటీ చైర్మన్, మంత్రి దామోదర రాజా నర్సింహాకు బుధవారం తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సక్కు బాయి మీడియాతో మాట్లాడారు.జీవో 317 అమలు వల్ల 33 జిల్లాలో స్థానికత కలిగిన జిల్లాలను బలవంతంగా కోల్పోయి కుటుంబాలకు దూరంగా పనిచేస్తూన్నారని సక్కు బాయి తెలిపారు.
ఇందులో ఎక్కువ శాతం నాన్ స్పౌజ్ ఉపాధ్యాయులున్నారని ,సీనియారిటీలో నష్టం జరిగిందని అన్నారు. చాలా మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు జూనియర్లు కావడం చేత సీనియర్లు తమకు నచ్చినటువంటి పట్టణ ప్రాంతాలకు రావడం మూలంగా జూనియర్ ఉద్యోగులను జిల్లాలకు బదిలీ చేసారని , ఏ అవకాశం లేని భార్యాభర్తల అయిన సింగిల్ ఎంప్లాయిస్‌కి ఏ కాలము, ప్రాధాన్యత క్రమము లేకపోవడం బాధాకరమని అన్నారు.