దేశాన్ని నడిపించే రాజకీయ శక్తులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం.. పరమత సహనం. ఉద్దేశాలు ఎలా ఉన్నా కనీసం మాటల్లోనూ ఇంకొన్ని చర్యల్లోనూ అది కనిపించేందుకు కొంతయినా కృషి చేయాలి. ఆ తరహా ప్రయత్నం లేనిదే ఏం చేయాలేం. కానీ దేశాన్ని ఏలే పెద్దలకు ఇవేవీ పట్టవు గనుక కొన్ని సందర్భాల్లో వాళ్లంతా అత్యంత ఆదర్శనీయం అన్న భావన ఒకటి పైకి వెల్లడి చేయడంలో ముందుంటారు.
ఆ విధంగా వారి మాట స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పరితపించిన నాయకుల మాటకు దగ్గరగా ఉంటుంది. ఆ విధంగా వీళ్లంతా భారతీయుల మెప్పు అయితే పొందుతున్నారు కానీ వాస్తవం మాత్రం ఆ విధంగా లేదు. వాస్తవం ఘోరం గా ఉంది. వాస్తవం భరించలేని విధంగా ఉంది. అటువంటప్పుడు వీళ్లు సాధించేదేంటి?
కాషాయ శ్రేణులకూ,నేతాజీకీ ఉన్న సంబంధం ఏంటన్నది ఇప్పుడొక ప్రశ్న. ఇవాళ ఆయన 125 వ జయంతి. దేశాన్ని దాస్య విముక్తం చేయాలన్న ఆలోచన నుంచి సొంతంగా సైన్యం ఏర్పాటు వరకూ ఎంతో కృషి చేసిన మహనీయుడు. ఆయన పేరు వెంట కీర్తి కోసం ఆ కీర్తిని తమ ఖాతాలో వేసుకుని కాస్తో కూస్తో లబ్ధి పొందేందుకు ఎవ్వరైనా ప్రయత్నాలు చేయొచ్చు.
రాజకీయ నాయకులు అయితే ఇంకాస్త ఎక్కువ ప్రయత్నమే చేస్తున్నారు కూడా!ఈ క్రమంలో బీజేపీ నాయకులు అయిన మోడీ మరో అడుగు ముందుకు వేసి ఇండియా గేట్ దగ్గర ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తనకు ఉందని అంటున్నారు.ఇదంతా బోస్ అంటే ప్రేమ అని అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం సగటు భారతీయుని కర్తవ్యం కావాలి.లేదంటే ఇబ్బందే!
నేతాజీ చెప్పిన విధంగా మన నాయకులు లేరని మనం ఎప్పుడో నిర్థారణకు రావాలి. ఆయన మనవడు కూడా ఒక్కటే మాట అంటున్నారు సర్వ మత సమ్మతి అన్నది నేతాజీ ప్రధాన సిద్ధాంతం అని దానిని పాటించాకనే ఏమైనా మాట్లాడాలి అని మన దేశ నాయకులను ఉద్దేశించి అంటున్నారు. చంద్రకుమార్ బోస్ (నేతాజీ మనవడు) చెప్పిన మాటలు మోడీకి నచ్చవు.కేవలం హిందుత్వ నినాదంతోనే ఒడ్డెక్కాలని భావించే వారికి ఆయన మాటలు పడవు కానీ అదే వాస్తవం.
అన్ని మతాలనూ కలుపుకుని పోయే సమ్మిళిత భావజాలంలో నేతాజీ ఉండేవారని,అదే ఆయన నమ్మిన సిద్ధాంతం అని చంద్ర కుమార్ బోస్ అంటున్నారు. ఈ దేశాన మతతత్వ రాజకీయాలు అతి సులువుగా చేసే కొన్ని పార్టీలకు,వారినే అంటి పెట్టుకుని ఉండే కొన్ని సంస్థలకు బోస్ ఆదర్శనీయం అవుతారా? లేదా కేవలం ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా చేస్తున్నవే నా? బోస్ ఇలా అనుకోలేదు.
బోస్ ఇలా చేయాలని చెప్పినా పాటించేందుకు నాయకులకు మనసు రాదు.అలాంటప్పుడు జయంత్యుత్సవాలు అన్నవి ఎందుకు వ్యక్తిగత ప్రయోజనాల కోసమేగా! అన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది.