కరోనా లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతో మందికి సేవలు అందించిన విషయం విదితమే. పేదలకు ఆహారంతోపాటు వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలను ఏర్పాటు చేశాడు. బస్సులను, విమానాలను ఏర్పాటు చేయించాడు. అలాగే అడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తున్నాడు. పేదలకు సహాయం చేయడం కోసం అతను తన ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10 కోట్ల మేర రుణాలను కూడా తీసుకున్నాడు. అయితే ఇన్ని చేసినందుకు గాను సోనూసూద్‌కు గౌరవం దక్కింది.
ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్ జెట్ సోనూసూద్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన అందించిన సేవల గౌరవార్థం తమ విమానంపై అతని బొమ్మను ఏర్పాటు చేసింది. ఈ విషయంపై సోనూసూద్ కూడా స్పందించాడు. ఆ విమానంపై ఉన్న తన బొమ్మను చూస్తుంటే తాను మోగా నుంచి ముంబైకి రిజర్వేషన్ లేని టిక్కెట్ ద్వారా వచ్చిన రోజులు గుర్తుకు వచ్చాయని తెలిపాడు. తాను తన తల్లిదండ్రులను ఎంతగానో మిస్ అవుతున్నట్లు తెలిపాడు.
స్పైస్ జెట్ తన పట్ల చూపిన అభిమానానికి కృతజ్ఞతలని సోనూసూద్ అన్నాడు. ఆ సంస్థ కూడా విదేశాల్లో ఉన్న ఎంతో మందిని ఇండియాకు తీసుకువచ్చి సహాయ సహకారాలను అందించిందని అన్నాడు. కాగా సోనూ సూద్ తన జీవితం, అందులోని పలు ముఖ్యమైన ఘట్టాలకు చెందిన విషయాలతో ఐయామ్ నో మెసయ్య అనే బుక్ కూడా రాశాడు. అది 2020 చివర్లో ప్రచురితం అయింది.