జాతీయ క్రీడా పురస్కారాల వేడుక ఒకటి లేదా రెండు నెలలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ అవార్డు వేడుకకు సంబంధించి రాష్ట్రపతి భవన్ నుంచి క్రీడా మంత్రిత్వ శాఖకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని ఓ అధికారి తెలిపారు.
జాతీయ క్రీడా పురస్కారాల వేడుక ఒకటి లేదా రెండు నెలలు వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. కరోనా నేపథ్యంలో వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారట. రాష్ట్రపతి భవన్ నుంచి తుది నిర్ణయం వచ్చాక దీనిపై స్పష్టత వస్తుందని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ పురస్కారాలు ప్రతి ఏటా ఆగస్టు 29న రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ వేడుక జరుపుతారు. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది.
కరోనా కారణంగా ఈ అవార్డుల కోసం దరఖాస్తు తేదీని కూడా పెంచారు. అలాగే ఆటగాళ్లు వ్యక్తిగతంగా అప్లై చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ కారణంగా ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు మంత్రిత్వ శాఖ ఆ అప్లికేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను మొదలుపెట్టలేదు. ఇంకా నెల రోజుల సమయమే ఉన్న పరిస్థితుల్లో ఈ అవార్డు వేడుక కచ్చితంగా వాయిదా పడుతుందని మరో అధికారి వెల్లడించారు.