ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో బంగ్లాదేశ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదున్న ఆ జట్టు ఇవాళ ఆఫ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గెలుపొందింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో బంగ్లాదేశ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదున్న ఆ జట్టు ఇవాళ ఆఫ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గెలుపొందింది. ఆ జట్టుపై బంగ్లాదేశ్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాంప్టన్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేయగలిగింది.
కాగా బంగ్లా బ్యాట్స్‌మెన్లలో ముష్ఫికుర్ రహీం (87 బంతుల్లో 83 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్), షకీబ్ అల్ హసన్ (69 బంతుల్లో 51 పరుగులు, 1 ఫోర్)లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఇక ఆఫ్గనిస్థాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్ కు 3 వికెట్లు దక్కగా, గుల్బదీన్ నయీబ్ కు 2 వికెట్లు, దావ్లత్ జద్రాన్, మహమ్మద్ నబీలకు చెరొక వికెట్ దక్కాయి.
అనంతరం 263 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆఫ్గనిస్థాన్ 47 ఓవర్లలో 200 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓ దశలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతున్నట్లు అనిపించినా బంగ్లా బౌలర్ల ముందు వారు దొరికిపోయారు. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా ఆఫ్గనిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో సమీఉల్లా షిన్వారి (51 బంతుల్లో 49 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్) నాటౌట్‌గా నిలవగా, కెప్టెన్ గుల్బదిన్ నయీబ్ (75 బంతుల్లో 47 పరుగులు, 3 ఫోర్లు) రాణించే ప్రయత్నం చేశాడు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 5 వికెట్లు పడగొట్టగా, ముస్తాఫిజుర్ రహమాన్ కు 2, మహమ్మద్ సైఫుద్దీన్, మొసద్దెక్ హొసెయిన్‌లకు చెరొక వికెట్ దక్కింది.