ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్- బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇటీవల ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని టీమిండియా 2-1 తో చేజిక్కించుకోగా.. కనీసం టెస్టుల్లోనైనా గట్టి పోటీనివ్వాలని పసికూన ఆశిస్తోంది. అయితే.. బ్యాటింగ్, బౌలింగ్‌లో తిరుగులేని భారత్‌ను ఆపడం మోమినుల్ హక్ సారథ్యంలోని యువ బంగ్లాదేశ్‌కు శక్తికి మించిన పనే. మోమినుల్ హక్ బంగ్లా బ్యాటింగ్ విభాగానికి కీలకం. ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్ చెప్పుకోతగ్గ బ్యాట్స్‌మెనే అయినా సుదీర్ఘ ఫార్మాట్‌లో అంతగా సఫలం కాలేకపోయారు.
2019-21 టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు టీమిండియా అజేయంగా సాగుతోంది. మూడు సిరీస్‌లలో మొత్తం 240 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. టీ20లకు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ కోహ్లీ వచ్చేశాడు. గత టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికాను చిత్తుచేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఇనుమడించిన ఉత్సాహంతో ఉంది.