టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప పిఎఫ్ చెల్లింపుల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. బెంగళూరుకి చెందిన సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఉత్తప్ప డైరెక్టర్ గా ఉన్నారు. అయితే తన కంపెనీ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించడం లేదని ఉతప్ప పై ఆరోపణలు వచ్చాయి.
ఉద్యోగులందరికీ 23.36 లక్షలు పిఎఫ్ ఫండ్ లో జమ చేయాల్సి ఉండగా.. ఉతప్ప కంపెనీ ఈ పీఎఫ్ అమౌంట్ ని జమ చేయలేదు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల అతనిపై పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే ఉతప్ప మాత్రం ఈ కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు.
ఈ కంపెనీ ద్వారా తాను కూడా మోసపోయానని చెప్పుకొచ్చాడు. 2018 – 19 లో ఈ కంపెనీకి రుణం రూపంలో కొంత ఆర్థిక సాయం చేసినందుకు తనను డైరెక్టర్ గా నియమించినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ కేసులో తాజాగా రాబిన్ ఉతప్ప కి భారీ ఊరట లభించింది. ఈపీఎఫ్ డిపాజిట్ల అక్రమాల కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు వెకేషన్ బెంచ్ అతడికి రక్షణ కల్పించింది.