ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు శుక్రవారం రోజున అట్టహాసంగా జరిగాయి. చారిత్రక కట్టడాల మధ్యలో నుంచి ఉరకలెత్తే సెన్ నదిపై ఈ పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి ఈ ఫ్రాన్స్ సెన్ నదిలో ఆరంభ వేడుకలు జరిగాయి. ఈ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ప్రదర్శించిన ఆరు భాషల్లో హిందీ కూడా ఒకటి. ‘సిస్టర్ హుడ్’ పేరిట ఫ్రాన్స్ మహిళలు అందించి తోడ్పాటుకు నివాళిగా కొన్ని ఇన్ఫోగ్రాపిక్స్‌ను ప్రదర్శించారు. అందులో హిందీలో కూడా ఒక ఇన్ఫోగ్రాఫిక్ ఉంది.
సెన్ నదిపై 6 కిలోమీటర్ల పాటు సాగిన పరేడ్లో 85 పడవలపై 6800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ వేడుకలను చూసేందుకు దాదాపు 3,20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరై సందడి చేశారు. ఈ పరేడ్‌లో భారత్ అథ్లెట్లు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ ఈ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి నాయకత్వం వహించారు.