మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. తొలి టెస్టులో దారుణ ఓటమి అనంతరం భారత్ ఆసీస్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఈ క్రమంలోనే నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1 తో సమం చేసింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హైదరాబాదీ బౌలర్ సిరాజ్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
గత 7 ఏళ్ల కాలంలో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన బౌలర్లలో ఒక టెస్ట్ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. సిరాజ్‌కు ఇది మొదటి టెస్టు మ్యాచ్ కాగా రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 36.3 ఓవర్లలో 77 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడు కేమరాన్ గ్రీన్‌ను సిరాజ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ ఔట్ చేయగా, మార్నస్ లబుషేన్ ను తొలి ఇన్నింగ్స్‌లో ఔట్ చేశాడు. అలాగే ట్రావిస్ హెడ్, నాథన్ లయాన్‌లను రెండో ఇన్నింగ్స్‌లో ఔట్ చేశాడు. దీంతో సిరాజ్ సరికొత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు.
కాగా అంతకు ముందు సరిగ్గా ఇదే రికార్డు మహమ్మద్ షమీ పేరిట ఉంది. 2012లో నవంబర్‌లో కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో షమీ టెస్టుల్లో ప్రవేశించగా, ఆ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 9 వికెట్లను తీశాడు. ఇక అంతకు ముందు అశ్విన్ 2011లో ఇదే రికార్డును పొందాడు. అతను నవంబర్ 2011లో ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరిగిన తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ కలిపి 9 వికెట్లను తీశాడు.