వరుస ఓటములతో సతమతం అవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్‌ను తప్పించి ఆ బాధ్యతలను కేన్ విలియమ్సన్‌కు అప్పగించింది. అయినప్పటికీ ఆ జట్టుకు మళ్లీ ఓటమి తప్పలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని అంశాల్లోనూ హైదరాబాద్ ఫెయిలైంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తాజా మ్యాచ్‌లో హైదరాబాద్ మళ్లీ ఓడింది.
ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ 2021 28వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. జాస్ బట్లర్ సెంచరీ (124)తో అదిరిపోయే ప్రదర్శన చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్ (48) కూడా స్కోరు బోర్డును పరుగెత్తించాడు. కాగా హైదరాబాద్ బౌలర్లు పేలవమైన ప్రదర్శన చేశారు. సందీప్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో మనీష్ పాండే, జానీ బెయిర్ స్టోలు ఆరంభంలో పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. కానీ విఫలం అయ్యారు. తరువాత హైదరాబాద్ ఏ దశలోనూ కోలుకోలేదు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహమాన్, క్రిస్ మోరిస్‌లకు చెరో 3 వికెట్లు చొప్పున, కార్తీక్ త్యాగి, రాహుల్ తెవాతియాలకు చెరొక వికెట్ చొప్పున దక్కాయి.