అబుధాబిలో శుక్రవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై హైదరాబాద్ విజయం సాధించింది. బెంగళూరు తక్కువ స్కోరు చేసినప్పటికీ దాన్ని ఛేదించడంలో హైదరాబాద్ ఒక దశలో వెనుకబడింది. అయితే విలియమ్సన్, హోల్డర్లు బాధ్యతాయుతంగా ఆడి హైదరాబాద్‌కు విజయాన్ని అందించారు. దీంతో బెంగళూరుపై హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా బెంగళూరు బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి కేవలం 131 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు బ్యాట్స్మెన్లలో డివిలియర్స్, ఫించ్ మినహా ఎవరూ రాణించలేదు. 43 బంతులు ఆడిన డివిలియర్స్ 5 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. అలాగే ఫించ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 32 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3 వికెట్లు తీయగా, నటరాజన్ 2 వికెట్లు తీశాడు. నదీంకు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో విలియమ్సన్, హోల్డర్లు రాణించారు. 44 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో విలియమ్సన్ 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 20 బంతుల్లో 3 ఫోర్లతో హోల్డర్ 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. అలాగే ఆడం జంపా, యజువేంద్ర చాహల్‌లకు చెరొక వికెట్ దక్కింది.
కాగా ఈ మ్యాచ్‌లో విజయంతో హైదరాబాద్ ఈ నెల 8వ తేదీన ఢిల్లీతో అబుధాబిలో క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఈ నెల 10న దుబాయ్‌లో ముంబైతో తలపడుతుంది.