ఇంగ్లండ్‌తో తాజాగా జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. తరువాత ఇంగ్లండ్ ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దీంతో భారత్ గెలుపొందింది. సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.
అయితే చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో 13వ ఓవర్ తరువాత ఇంగ్లండ్ ప్లేయర్లు జాస్ బట్లర్, డేవిడ్ మలన్‌లు అర్ధ సెంచరీలు పూర్తి చేసి జోరు మీదున్నారు. ఈ క్రమంలో బౌలింగ్ వేసిన భువనేశ్వర్ కుమార్ తన బౌలింగ్‌తో జాస్ బట్లర్‌ను ఔట్ చేశాడు. అయితే బట్లర్ పిచ్‌ను వీడి మైదానం నుంచి పెవిలియన్ వైపు వెళ్తుండగా భారత కెప్టెన్ కోహ్లి కామెంట్లు చేశాడు. అతను అన్న మాటలు రికార్డు కాలేదు. కానీ అతని హావభావాలు చూస్తే అతను ఎలాంటి మాటలు అన్నాడో అర్థమవుతుంది.
ఈ క్రమంలో స్పందించిన బట్లర్ కూడా వాదనకు దిగాడు. దీంతో అంపైర్లు కలగజేసుకుని ఇద్దరికీ సర్ది చెప్పారు. అయితే విరాట్ కోహ్లి అలా మైదానంలో ప్రవర్తించిన తీరు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ప్రకారం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ క్రమంలో అంపైర్లు అతని ఖాతాలో 2 డిమెరిట్ పాయింట్లను చేర్చారు. ఇప్పటికే కోహ్లి ఖాతాలో ఉన్న 2 పాయింట్లకు మరో 2 పాయింట్లు తోడై 4 పాయింట్లు అయ్యాయి. దీంతో కోహ్లి 1 టెస్టు మ్యాచ్ లేదా 2 వన్డే, టీ20ల నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. అదే అమలు అయితే ఇంగ్లండ్ తో జరిగే 3 వన్డేల సిరీస్‌లో కోహ్లి మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. కానీ దీనిపై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.