పేట‌ర్నిటీ లీవ్ తీసుకుంది అందుకే.. ఓపెన్ గా చెప్పిన కోహ్లి..!

-

న‌వంబ‌ర్ 10న ముగిసిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ త‌రువాత భార‌త ఆట‌గాళ్లు నేరుగా క్వారంటైన్ ముగించుకుని ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో టూర్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా భార‌త్‌, ఆస్ట్రేలియాల మ‌ధ్య 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్ట్‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే చివ‌రి మూడు టెస్టుల‌కు కోహ్లి అందుబాటులో ఉండ‌డం లేదు. త‌న భార్య అనుష్క శ‌ర్మ త‌మ మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుండ‌డంతో కోహ్లి పేట‌ర్నిటీ లీవ్ తీసుకున్నాడు. దీనిపై అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ధోనీని చూసి కోహ్లి నేర్చుకోవాల‌న్నారు. దేశం క‌న్నా కుటుంబమే ముఖ్య‌మా అని ప్ర‌శ్నించారు. అయితే దీనిపై కోహ్లి స్పందించాడు.

ఆస్ట్రేలియాతో టూర్ నేప‌థ్యంలో చివ‌రి 3 టెస్టులు ఆడ‌క‌పోవ‌డంపై అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కోహ్లి ఓపెన్ అయ్యాడు. తాజాగా అత‌ను మాట్లాడుతూ.. సెలెక్ట‌ర్లు ఆస్ట్రేలియా టూర్‌కు జట్టును ఎంపిక చేసే స‌మ‌యంలోనే తాను లీవ్ అడిగాన‌ని అన్నాడు. త‌న భార్య అనుష్క శ‌ర్మ త‌న మొద‌టి బిడ్డ‌కు జన్మ‌నిస్తుంద‌ని, అది త‌న‌కు చాలా చాలా ప్ర‌త్యేక‌మైన క్ష‌ణ‌మ‌ని, అలాంటి క్ష‌ణాల్లో ఆమె వ‌ద్ద తాను లేక‌పోతే ఎలా ? అని కోహ్లి అన్నాడు. అందుక‌నే పేట‌ర్నిటీ లీవ్ తీసుకున్న‌ట్లు తెలిపాడు.

కాగా కోహ్లికి మాజీ క్రికెట‌ర్లు క‌పిల్ దేవ్‌, జ‌స్టిన్ లాంగ‌ర్ త‌దిత‌రులు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇక భార‌త్ డిసెంబ‌ర్ 17న ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో మొద‌టి టెస్ట్ ఆడ‌నుంది. త‌రువాత మెల్ బోర్న్‌లో డిసెంబ‌ర్ 26 నుంచి, సిడ్నీలో జ‌న‌వ‌రి 7 నుంచి, బ్రిస్బేన్‌లో జ‌న‌వ‌రి 15 నుంచి వ‌రుస టెస్ట్‌ల‌ను ఆడ‌నుంది. ప్ర‌స్తుతం కోహ్లి ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా.. వ‌న్డేలు, టీ20లు, మొద‌టి టెస్టుకు మాత్ర‌మే అత‌ను అందుబాటులో ఉండ‌నున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version